ఒక షాప్ వద్ద భిక్షాటన చేస్తుండగా.. వారికి భిక్షం వేసిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: తమ డిమాండ్లను గురుకుల టీచర్ అభ్యర్థులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. పోస్టులు మిగిలిపోకుండా భర్తీ చేయాలని, కోర్టు ఆర్డర్ ప్రకారం గురుకులాల్లో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, పలు మార్లు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. అక్కడ నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు.
దీంతో గురుకుల టీచర్ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం అశోక్ నగర్ వద్ద నిరసన తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో దూర ప్రాంతాల నుండి హైదరాబాద్ వచ్చామని, తిరిగి ఇంటికి వెళ్లేందుకు కూడా తమ వద్ద డబ్బు లేదని వారు భిక్షాటన చేశారు. అయితే, ఒక షాప్ వద్ద భిక్షాటన చేస్తుండగా.. వారికి భిక్షం వేసిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
తాను నిరసన తెలిపేందుకు రాలేదని, అక్కడ పని చేస్తున్నానని ఆమె వాపోయింది. తనను అరెస్ట్ చేస్తే ఉద్యోగం పోతుందని, ఆందోళన చేసిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయా యువతి చేతులు జోడించి మరీ వేడుకుంది. అయినప్పటికీ ఓ లేడీ కానిస్టేబుల్ యువతిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే, తాజగా ఈ అంశంపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ధర్నా చేస్తున్న వారు లోపలికి వచ్చి భిక్షాటన చేస్తున్నారని షాపుల యజమానులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ యువతి పక్కన ఉన్న ఒక అకాడమీలోకి వెళ్లి తాను ఇక్కడ పని చేసే అమ్మాయిగా చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని వెల్లడించారు. ఆమెను అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.