అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
న్యూస్ లైన్ డెస్క్: హైడ్రా పరిధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిర్వహించిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ మాట్లాడారు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు హైడ్రాను రాష్ట్రంలో మొత్తంలో తీసుకురావాలని కోరుతున్నారని, కానీ అది కేవలం హైదరాబాద్, ఓఆర్‌ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రమే పని చేస్తుందని తెలిపారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు డ్రైనేజ్‌ను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వదులుతున్నారని సీఎం అన్నారు. ఆ నీళ్లు హైదరాబాద్ ప్రజలు తాగాలా? అందుకే కూల్చివేతలు చేస్తున్నామని తెలిపారు. హైడ్రా కూల్చివేతల విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షం అంటూ లేదని సీఎం స్పష్టం చేశారు. మొదట కూల్చింది కాంగ్రెస్ నేత పళ్లంరాజు నిర్మాణాన్నే అని రేవంత్ చెప్పారు. జన్వాడ ఫామ్‌హౌస్‌కు గ్రామ పంచాయతీ అనుమతులు లేవన్నారు. ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలను హైకోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని, హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తామని అన్నారు.
హైడ్రా పరిధిలో తమ కుటుంబ సభ్యుల నిర్మాణాలు ఉన్నా.. తానే నిలబడి కూల్చేస్తానాని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం జీవో 111 ఎత్తేసేందుకు ప్రయత్నించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను కొనసాగిస్తుందన్నారు. ఓవైసీ కాలేజీ విషయంలో విద్యాసంవత్సరం నష్టపోతుందని సమయం ఇచ్చామని, విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం కాబట్టి ఆలోచిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. అందరికీ రుణమాఫీ జరుగుతుందని, కలెక్టర్ల దగ్గర గ్రీవెన్స్ పెట్టామని సీఎం తెలిపారు. రుణమాఫీ కానివారి జాబితా కలెక్టరేట్‌లో ఇవ్వాలని వాటిని పరిశీలిస్తామన్నారు. ఇప్పటివరకు రూ.17,933 కోట్లు రుణమాఫీకి జమ చేశామని, 2 లక్షలకు పైగా ఉన్నవారు.. పైన ఉన్న అమౌంట్ కట్టేస్తే రూ.2లక్షల రుణమాఫీ జరుగుతుందని తెలిపారు.