సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మంగళవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
న్యూస్ లైన్ డెస్క్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మంగళవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జడ్జీల బాధలు ఆ సీట్లలో కూర్చుంటే తెలుస్తాయని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు బెంచీలు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఉండాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందన్నారు. లా కమిషన్, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై లేదా హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌లు పెట్టాలని సూచించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రాజ్యాంగం ఆర్టికల్ 130కే బెంచీలు ఏర్పాటు చేసే అధికారం ఉందన్నారు. నాలుగు చోట్ల సుప్రీం బెంచ్‌లు ఏర్పాటు చేయడం దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని కొందరు అనవసర వాదన లేవనెత్తుతున్నారు. తను 2015 లోనే ఎంపీగా సుప్రీం బెంచీల ఏర్పాటు ఆవశ్యకత ఉందని పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించానాని ఆయన తెలిపారు.
దేశంలో 5.1 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, 20 లక్షల కేసులు 30 ఏళ్లగా పెండింగ్‌లో ఉన్నాయి అని తెలిపారు. సుప్రీంకోర్టుకు 34 మంది జడ్జీలే ఉన్నారు.. 64 మంది ఉంటే తప్పేమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 24 మంది జడ్జిలే ఉండే వారు అని, కేసీఆర్ చొరవతో 2018లో 42 మంది జడ్జిలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందులో అప్పటి సీజే ఎన్.వి రమణ చొరవ కూడా ఉందని, ఏపీ హైకోర్టులో 37 మంది జడ్జిలే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి. సుప్రీం బెంచ్‌లు నాలుగు చోట్ల ఏర్పాటు చేయడంతో పాటు సుప్రీం కోర్టు జడ్జిల సంఖ్యను 64కు పెంచాలని కోరారు. ఫుల్ కోర్టు న్యాయవాదులు సుప్రీం బెంచీల ఏర్పాటును రకరకాల కారణాలతో వ్యతిరేకిస్తున్నారు. ఫుల్ కోర్టు తన వైఖరి మార్చుకుని సుప్రీం బెంచీల ఏర్పాటు చేసేందుకు జడ్జీల సంఖ్య పెంచేందుకు చొరవ చూపాలని వినోద్ కుమార్ కోరారు.