రాత్రి రెండు నుంచి మూడు గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లు తీసుకొని వచ్చిన అధికారులు.. తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు వాపోతున్నారు. ఇళ్లను కూల్చవద్దని కాళ్ల మీద పడ్డా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా కమిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా చెరువులు, వాటి పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను, కట్టడాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేయిస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్లో, చెరువుల భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాల్లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు చెందినవే అధికంగా ఉన్నాయి. దీంతో గతంలో ఆ కట్టడాలకు ఎలా అనుమతి ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనుమతి ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా, కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పట్టా భూముల్లో నిర్మించిన ఇళ్లను కూడా హైడ్రా కూల్చేయడంతో.. ఈ అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలో ఆదర్శనగర్‌లో ఇళ్లను గురువారం తెల్లవారుజామున కూల్చేశారు. రాత్రి రెండు నుంచి మూడు గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లు తీసుకొని వచ్చిన అధికారులు.. తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు వాపోతున్నారు. ఇళ్లను కూల్చవద్దని కాళ్ల మీద పడ్డా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని చెబుతున్నా వినిపించుకోకుండా తమ ఇళ్లను కూల్చేశారని వెల్లడించారు.
అర్ధరాత్రి హఠాత్తుగా వచ్చి ఇళ్లను కూల్చేయడంతో పిల్లాజెల్లా అంతా రోడ్డున పడ్డామని కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలను వదిలేసి తమపై ఎందుకు కక్షగడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మా కాంగ్రెస్ అని అధికారంలోకి తెచ్చుకుంటే మా ఇళ్లనే కూల్చేశారని వాపోతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన పట్టా భూములను చూపించి.. అప్పుడు వాళ్లే పట్టా భూములు ఇప్పించారు. ఇప్పుడు అదే సర్కార్ ఇళ్లను కూల్చేస్తోందని చెబుతున్నారు. 'మా బతుకులను ఎందుకు ఆగం చేస్తున్నారు సారూ..' అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.