న్యూస్ లైన్ డెస్క్ : ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా హైదరాబాద్ లోని రామ్ నగర్ లో అడుగుపెట్టింది. మణెమ్మ బస్తీలోని నాలాపై నిర్మించిన ఇళ్లు, ఇతర కట్టడాలను కూల్చివేసేందుకు అధికారులు రామ్ నగర్ వెళ్లారు. ఉదయం నుంచే బుల్డోజర్లతో మున్సిపల్, హైడ్రా అధికారులు రాం నగర్, మణెమ్మ బస్తీలో కూల్చివేతలు మొదలుపెట్టారు. మణెమ్మ బస్తీలోని 1-9-189 ఇంటినెంబర్ తో ఉన్న స్థలం విక్రయ్ యాదవ్ కి చెందినదని యజమాని వాదిస్తున్నారు. కాగా.. ఈ స్థలంపై హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ నడుస్తోందని స్థానికులు ఫిర్యాదుచేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు.
జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో మణెమ్మ బస్తీలోని నిర్మాణాలన్నీ అక్రమమేని రిపోర్టు అందడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు సిద్ధమవుతుండటంతో రాం నగర్, మణెమ్మ బస్తీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.