కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల్ మండలంలో అభివృద్ధి పేరుతో రైతులు, పేదల భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాక్కోవడం ఆపాలని రైతులు డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల్ మండలంలో అభివృద్ధి పేరుతో రైతులు, పేదల భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాక్కోవడం ఆపాలని రైతులు డిమాండ్ చేశారు. పేదల భూములు తీసుకోకుండా ఏ ప్రాంతంలో ఎటువంటి నష్టం లేని కంపెనీలు పెట్టి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ, మాజీ జెడ్పిటిసి కోట్ల మైపాల్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎరాన్ పల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోట్ల యాదగిరి మాట్లాడారు. ఫార్మ కంపెనీ పేరుతో హకింపేట్-505, పోలేపల్లి-130ఎకరాలు, లగచర్ల, పులిచర్లలలో తాండ, రోటిబండా తాండలో 643 ఎకరాలు మొత్తం 1274 ఎకరాలు సేకరించడానికి ఇప్పటికే నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. రైతులు, పేదల సమ్మతి లేకుండా బలవంతంగా భూ సేకరణ చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గత ప్రభుత్వాలు ఈలాంటి రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం, ప్రజలకు, రైతు, వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంభిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని వారు అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 1154 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి అన్యక్రాంతమైంది. కానీ అధికార యంత్రాంగం అట్టి భూముల జోలికి పోకుండా పేదల, సన్నకారు, చిన్న కారు రైతులకు అన్యాయం చేస్తున్నారు. దాంతో పాటు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ అసైన్డ్ భూములలో సాగులో ఉన్న సాగుదారులకు పట్టా పాస్ బుక్ లో ఇవ్వాలన్నారు. ధరణి పోర్టల్ వల్ల ఏర్పడిన భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని భవిష్యత్తులో పేదల భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రణాళిక రూపొందించి పోరాటాలకు సన్నదం కావడానికి ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.