KTR: ఇది తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం

అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Jul 31, 2024 06:19:51 AM
postImages/2024-07-31/1722424774_GTz7D10W8AAUKC.jpeg

న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని మండిపడ్డారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారు. ఈ అవమానం కేవలం సబితక్కకు, సునీతక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం అన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయం అన్నారు. ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి అని విమర్శించారు. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించడం దారుణం అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తదని హెచ్చరించారు. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు అని ఆయన అన్నారు. 

ప్రజల దీవెనలు, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు అని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయం అన్నారు. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చిర్రు భట్టి అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడినం అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నామని, అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం అని కేటీఆర్ అన్నారు. ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం.. మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం అన్నారు. ముఖ్యమంత్రి సిగ్గు, బుద్ధి, జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకోవాలని, అడ్డగోలుగా మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ పారిపోయారని కేటీఆర్ విమర్శించారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress ktr cm-revanth-reddy assembly

Related Articles