గురుకులం అంటే మరో కుటుంబం అని నా కొడుకును అక్కడికి పంపిస్తే, నా కొడుకును నాకు లేకుండా చేశారంటూ చిన్నారి తల్లి కన్నీరు పెట్టుకున్నారు. ఇంకో తల్లికి ఈ కడుపు కోత మిగలకుండా మీరే చూసుకోవాలని కంటతడి పెట్టి కేటీఆర్‌ను కోరారు.
న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల గురుకుల పాఠశాలలో మృతిచెందిన విద్యార్థి కుటుంబాన్ని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో చదువుకుంటున్న అనిరుధ్ పాము కాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. అనిరుధ్ కుటుంబాన్ని కలిసి వారితో మాట్లాడారు. గురుకులం అంటే మరో కుటుంబం అని నా కొడుకును అక్కడికి పంపిస్తే, నా కొడుకును నాకు లేకుండా చేశారంటూ చిన్నారి తల్లి కన్నీరు పెట్టుకున్నారు. ఇంకో తల్లికి ఈ కడుపు కోత మిగలకుండా మీరే చూసుకోవాలని కంటతడి పెట్టి కేటీఆర్‌ను కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఇప్పటి వరకు 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని అన్నారు. . దాదాపు 500 మంది గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కి గురయ్యారని వెల్లడించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా గురుకులాల పరిసరాలు శుభ్రం చేసి.. చనిపోయిన 36 పిల్లల కుటుంబాలను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గురుకులాలను మరింత బాగు చేసేందుకు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ తో కమిటీ వేయించి సమీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ రిపోర్టును ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరముందని కేటీఆర్ అన్నారు.