జర్నలిస్టుల వెనుక ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉంటాయో ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు గమనించాలన్నారు. మూడు దశాబ్దాలుగా తమ హక్కుల కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
న్యూస్ లైన్, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టుల ఆందోళనల కొనసాగుతున్నాయి. ఇళ్ల స్థలాల సాధన కోసం గత 15 రోజులుగా అనేక విధాలుగా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం అర్థనగ్న ప్రదర్శన చేశారు. దీనిలో భాగంగా ఆర్డీవో కార్యాలయం ముందు దీక్ష శిబిరం నుండి అర్ధ నగ్నంగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు న్యాయపరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం గత 30 సంవత్సరాలుగా పడిగాపులు కాస్తున్నామన్నారు. జర్నలిస్టుల వెనుక ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉంటాయో ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు గమనించాలన్నారు. మూడు దశాబ్దాలుగా తమ హక్కుల కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
విధిలేని పరిస్థితిలో జర్నలిస్టులంతా ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు. వృత్తిపరంగా సమాజంలో గౌరవప్రదంగా ఉండే జర్నలిస్టులు అర్థనగ్న ప్రదర్శన చేయాల్సిన పరిస్థితిని తీసుకువచ్చిన ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరారు.