సీనియర్ ఫ్యాకల్టీ సమ్మె చేయడమంటే మళ్లీ దళిత ఇతర పీడిత జాతులను రాతియుగం నాటి రోజులకు నెట్టే కుట్ర జరుగుతున్నదని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రపంచ స్థాయి కెదిగిన సంక్షేమ గురుకుల పాఠశాల గౌలిదొడ్డిలో గత మూడున్నర నెలలుగా జీతాలు రావడం లేదని సబ్జెక్టు నిపుణులు, సీనియర్ ఫ్యాకల్టీ సమ్మె చేయడమంటే మళ్లీ దళిత ఇతర పీడిత జాతులను రాతియుగం నాటి రోజులకు నెట్టే కుట్ర జరుగుతున్నదని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆనాడు వేదం చదివాడని శంభూకునికి తల నరకడానికి, జ్ఞానం నేర్చుకోవాలని చూస్తే శూద్రుల చెవుల్లో సీసం కరిగించి పోయడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రకు తేడా ఏముందని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలే పూర్తి బాధ్యత వహించాలని, మీకు తెలవకుండా ఈ కుట్రలు జరుగుతయా అని నిలదీశారు.
కేసీఆర్ పాలనలో స్వర్ణ యుగం చూసి ప్రపంచ స్థాయికెదిగిన గురుకులాలు ఇప్పుడు మృత్యుకుహరాలుగా మారియి అని అవేదన వ్యక్తం చేశారు. గౌలిదొడ్డి లాంటి ఎన్నో ఎక్సలెన్స్ కేంద్రాలు వేల మంది పీడిత వర్గాల పిల్లలను డాక్టర్లు ఇంజనీర్లుగా చేయడం జరిగిందన్నారు. ఈనాడు గురుకులాల్లో సీవోయి, క్రీడా అకాడమిల్లో పని చేస్తున్న ఫ్యాకల్టీ జీతాలు 3 నెలలుగా ఇవ్వకపోవడం అనేది బీఆర్‌ఎస్ అభివృద్ధి చేసిన గురుకులాల మీద, దళిత వర్గాల మీద జరుగుతున్న అతి పెద్ద కుట్ర అని ఆరోపించారు.
తెలంగాణలో ఎంతో గొప్ప చైతన్యం కలిగిన ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, దళిత బహుజన విద్యార్థి సంఘాలు మన బిడ్డల భవిష్యత్ కోసం రోడ్డు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు విమాన టికెట్లకు&విలాసాలకు మాత్రమే కాకుండా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి గురుకుల ఫ్యాకల్టీ జీతాలు ఇవ్వడంలో శ్రద్ద చూపెడితే బాగుంటుందన్నారు. మీకు నిజంగా రాజ్యాంగం మీద నమ్మకముంటే ఈ పేద పిల్లల మెస్ ఛార్జీలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పీడిత వర్గాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురుకుల ఫ్యాకల్టీ జీతాలు వెంటనే చెల్లించకపొతే ప్రజలు మరో తెలంగాణ గురుకుల పరిరక్షణ ఉద్యమానికి సిద్ధం అవుతారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.