కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని జిల్లాలో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. దీంతో జ్వరాల విజృంభణ జోరందుకుందని విమర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో డెంగ్యూ మరణాల లెక్కను ఎందుకు దాచిపెడుతున్నారని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో నమోదవుతున్న డెంగ్యూ మరణాలపై స్పందించిన ఆయన సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని సర్కార్ చెప్తోంది. మరోవైపు, మొన్న ఐదు, ఈరోజు మూడు డెంగ్యూ మరణాలు నమోదైనట్లు వార్తపేపర్లలో వచ్చిందని ఆయన తెలిపారు. ఈ డేటాను ఎవరు, ఎందుకు దాచిపెడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
ఒక్క ఖమ్మం జిల్లాలోనే గత పది రోజుల్లో డెంగ్యూ, విష జ్వరాలతో పదిమంది చనిపోయారని ఆయన తెలిపారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 400, భద్రాద్రి జిల్లాలో 130 చొప్పున డెంగ్యూ పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని జిల్లాలో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. దీంతో జ్వరాల విజృంభణ జోరందుకుందని విమర్శించారు.
ఆసుపత్రుల్లో సరిపడా మందులు లేవని, చాలా ఆసుపత్రుల్లో 3-4 మంది ఒకే మంచం పంచుకుంటున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆస్పత్రుల్లో సరిపడా మెడిసిన్ కూడా లేదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని ఆయన సూచించారు.