పెళ్లికి చావుకి తేడా తెలియని పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓదార్పు కోసం వచ్చారా.. లేదా సంబరాల కోసం వచ్చారా అర్ధం కాలేదని ఆయన ఎద్దేవా చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో వచ్చినది ప్రకృతి విలయం కాదు.. ప్రభుత్వం సృష్టించిన విలయం అని మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతలు పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. పెళ్లికి చావుకి తేడా తెలియని పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓదార్పు కోసం వచ్చారా.. లేదా సంబరాల కోసం వచ్చారా అర్ధం కాలేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ కాల్వకట్ట(సాగర్ ఎడమ కాల్వ గండి) దెబ్బతినడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే. రైతులు ఆధారాలు కూడా చూపిస్తున్నారు*
ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు కాలువ కట్టమీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గాట్లకు వెల్డింగ్ చేసి నీళ్లు పోకుండా… pic.twitter.com/lWLOyf3K1c — Jagadish Reddy G (@jagadishBRS) September 3, 2024
నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్ట దెబ్బతినడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని ఆయన ఆరోపించారు. రైతులు ఆధారాలు కూడా చూపిస్తున్నారని వెల్లడించారు. గేట్లకు వెల్డింగ్ చేయడం వల్ల వరద వచ్చినప్పుడు గేట్లు తెరుచుకోలేక ప్రెషర్‌కు కట్ట కొట్టుకుపోయిందని రైతులు ఆధారాలు చూపిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలకు ధైర్యం చెప్పవలసిన సీఎం రెండు రోజుల పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టుకోడానికి మాజీ సీఎం BRS అధినేత కేసీఆర్, BRS పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను గాలికి వదిలేసి సీఎం, మంత్రులు జల్సాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇక్కడ రైతులు తమ పొలాలను బాగుచేస్తే చాలు.. మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. పూర్తిగా ఇసుక మేటలు పేరుకుపోయి రాళ్లు రప్పలతో పొలాలు నిండిపోయాయని అన్నారు. చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని రైతులు అంటున్నారని ఆయన వెల్లడించారు. ఇక్కడ జరిగిన నష్టానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. పంట కొట్టుకుపోయిన పొలాలకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఈ డిమాండ్లు చేసిందని ఆయన అన్నారు.