CONGRESS:కాంగ్రెస్ ఇజ్జత్ పాయే..! 

తెలంగాణ కాంగ్రెస్ తీరును జాతీయ మీడియా ఎండగట్టింది. మహిళల పట్ల కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడింది. సినీ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర


Published Oct 05, 2024 10:55:00 AM
postImages/2024-10-05/1728104155_NAGARJUNA.jpg

నేషనల్ మీడియాలో ఫుల్ డ్యామేజ్

సీఎం రేవంత్ మౌనంపైనా ఆగ్రహం

మంత్రి కొండా సురేఖపై చర్యలేవి ?

జాతీయ మీడియాలో వాడివేడిగా చర్చలు

ఎన్నికల ముందు పరువు పోయిందంటూ..?

తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు!

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ తీరును జాతీయ మీడియా ఎండగట్టింది. మహిళల పట్ల కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడింది. సినీ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా..కాంగ్రెస్ అధినాయకత్వాన్ని నేషనల్ మీడియా కడిగిపారేసింది. ఇంత వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. రాజకీయాలను దిగజారుస్తున్నారంటూ దుమ్మెత్తిపోసింది. గతంలో సినీ తారలపై కాంగ్రెస్ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇదేనా మీ విధానమంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

సినీ తారలు నాగచైతన్య  సమంతల విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ చర్చకు దారితీశాయి. ఓ మహిళపై ఇంత దిగజారీ మాట్లాడాలా అంటూ కాంగ్రెస్ పార్టీని జాతీయ మీడియా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని జాతీయ మీడియా ప్రతినిధులు కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల కోసం ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తారా అని నిలదీస్తున్నారు. 

టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఎన్డీటీవీ, సీఎన్ఎన్ .. ఛానల్ ఏదైనా ఇదే అంశంపై డిబేట్ జరిగింది. పబ్లిక్ లైఫ్‌లో ఉన్న నేతలు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో తెలియదా అని క్వశ్చన్ చేశాయి. కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై ఈ సందర్భంగా జాతీయ మీడియా ప్రతినిధులు ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను పలువురు గుర్తు చేశారు. ఎంపీ కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే, హేమామాలినిపై రణదీప్ సింగ్ సూర్జేవాలా, మీనాక్షి నటరాజన్‌పై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వాళ్లపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. మహిళల పట్ల ఆ పార్టీ తీరును ఎండగట్టారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని అడిగారు. 48 గంటలైనా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని జాతీయ మీడియా ప్రశ్నించింది. ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీసింది. 

జాతీయ మీడియా అడుగుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిబేట్‌కి వచ్చిన అందరూ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటంతో ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. మేకా శ్యామ్ ప్రసాద్ కుమార్ లాంటి వారు నేషనల్ మీడియా సాక్షిగా తప్పును ఒప్పుకోవలసిన పరిస్థితి. మూడు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రి అయిన వ్యక్తి మాట్లాడే పద్ధతేనా అంటూ ప్రశ్నల వర్షం కురిసింది. కాంగ్రెస్ పార్టీ భావజాలానికి ఇది నిదర్శనమంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. జాతీయ స్థాయిలో పలు అంశాలను ప్రస్తావిస్తూ హస్తం పార్టీపై విమర్శలు గుప్పించింది. తాజా పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. ఏదో ఒక చర్య తీసుకోకపోతే తప్పదన్న పరిస్థితి ఏర్పడింది.

newsline-whatsapp-channel
Tags : india-people congress cm-revanth-reddy konda-surekha national-media priyanka-gandhi

Related Articles