జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
న్యూస్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 17 నెలల క్రితం అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు దేశం విడిచి వెళ్లొద్దని సూచించింది. ఆయన పాస్ పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కాగా.. 17 నెలల జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సిసోడియాకు తాజా బెయిల్ తో భారీ ఊరట లభించింది.
మద్యం కుంభకోణం కేసులో 2023 ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కొత్త మద్యం పాలసీలో సిసోడియా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ పలుసార్లు విచారణ జరిపింది. గతేడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసింది. విచారణ సమయంలో లొంగిపోతే సీఎం కుర్చీ ఆశ చూపిందని బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద సిసోడియా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు రావాలని సీబీఐ అధికారులు కూడా తనపై ఒత్తిడి తెచ్చారని.. లేదంటే జైలుకు పంపిస్తామని బెదిరించారని అప్పట్లో సిసోడియా పేర్కొన్నారు. జైలు జీవితాన్ని అనుభవిస్తున్నా బీజేపీ బెదిరింపులకు, సీబీఐ హెచ్చరికలకు లొంగకుండా సిసోడియా పోరాటాన్ని కొనసాగించారు. సిసోడియాకు బెయిల్ రావడం పట్ల ఆప్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.