బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో స్థానిక బలూచ్ ప్రజలు పాకిస్తాన్ జాతీయ పతాకాలను తొలగించి, వాటి స్థానంలో బలూచిస్థాన్ జెండాలను ఎగురవేస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో స్వాతంత్ర్య పోరాటం మరోమారు తీవ్ర రూపం దాల్చింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ ఏ) తన కార్యకలాపాలను ముమ్మరం చేయడంతో పాకిస్థాన్ ప్రభుత్వానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో చాలా పరిస్థితులను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటూ బీఎల్ఏ తమ ప్రత్యేక దేశ డిమాండ్ ను బలంగా వినిపిస్తుంది. బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో స్థానిక బలూచ్ ప్రజలు పాకిస్తాన్ జాతీయ పతాకాలను తొలగించి, వాటి స్థానంలో బలూచిస్థాన్ జెండాలను ఎగురవేస్తున్నారు.
ఈ పరిణామాలపై మీర్ యార్ బలూచ్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "బలూచ్ ప్రజలు తమ సొంత జెండాలను ఎగురవేయడం, పాకిస్థానీ జెండాలను దించివేయడం ప్రారంభించారు. ప్రపంచ దేశాలు పాకిస్థాన్ నుంచి తమ దౌత్యకార్యాలయాలను ఉపసంహరించుకొని కొత్తగా ఆవిర్భవిస్తున్న బలూచిస్థాన్ దేశానికి మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. పాకిస్థాన్ కు గుడ్ బై బలూచిస్థాన్ కు స్వాగతం " అని ట్వీట్ లో బీఎల్ ఏ తరపున పిలుపునిస్తున్నట్లు గా పేర్కొన్నారు.
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇదివరకే పాకిస్థాన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తోంది. ఇప్పుడు బలూచ్ పౌరులు కూడా పాకిస్థాన్ జెండాలను తొలంగించే కార్యక్రమాల్లో పాల్గొనడం పరిస్థితి తీవ్రతను సూచిస్తుంది. 1971 నుంచి బలూచిస్థాన్ ప్రత్యేక దేశం కోసం పాకిస్థాన్ తో సంఘర్షణ కొనసాగుతూనే ఉంది.