యూరియా దొరకతలేదు!
గంటల తరబడి క్యూ లైన్‌లలో అన్నదాతలు
తెల్లారకముందే క్యూ కడుతున్న రైతులు
పలుకుబడి ఉన్నోళ్లకే యూరియా?
బ్లాక్ మార్కెట్‌లో జోరుగా దందా ?
ముందస్తు ప్రణాళికలు శూన్యం
పట్టించుకునే నాథుడు లేడన్న రైతులు
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లారకముందే యూరియా దుకాణాల ముందు, సొసైటీల ముందుకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు బ్లాక్ మార్కెట్‌లో యూరియా దందా జోరుగా జరుగుతుందని, పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు వాపోతున్నారు. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో యూరియా కొరతను వ్యాపారులు కూడా సొమ్ము చేసుకుంటున్నారు. పలుకుబడి ఉన్నోళ్లకే యూరియా అందుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 13): యూరియా కోసం రైతాంగం నానా అగచాట్లు పడుతోంది. పెద్ద పెద్ద క్యూ లైన్లలో నిలుచుని గంటల తరబడి ఎదురు చూస్తోంది. కొందరు ఎంతసేపు లైన్‌లో నిలుచున్నా దొరకని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇదేం తీరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా ఫలితం లేకుండా పోతోందని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామ రైతులు వాపోతున్నారు. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని కో-ఆపరేటివ్ రైతు బజార్‌లో రైతులు క్యూ కట్టారు. తెల్లరాక ముందే వచ్చి లైన్‌లో నిలబడ్డామని తెలిపారు. అయినా కూడా యూరియా బస్తాలు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సమాచారంతో గురువారం నాడు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ సొసైటీకి 470 బస్తాలు మాత్రమే రావడంతో కొంతమంది రైతులకు బస్తాలు దొరకలేదు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు డబ్బులు చెల్లించినా యూరియా బస్తాలు రానివారికి నగదు రిటర్న్ చేస్తున్నారు.
కాగా, చాలా ప్రాంతాల్లో పలుకుబడి ఉన్నవాళ్లకే యూరియా బస్తాలు అందజేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన వారు ఎక్కువగా యూరియా బస్తాలు పొందుతున్నారని, మిగిలిన వాళ్లు ఉత్త చేతులతో వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. వచ్చేవే తక్కువ బస్తాలు అయినప్పుడు ఇలా అడ్డదారుల్లో అయిన వారికి పంచేస్తే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. అలాగే బ్లాక్ మార్కెట్‌లో కూడా దందా జోరుగా జరుగుతోంది. కృత్రిమ కొరత సృష్టించి కొంతమంది యూరియాను అధిక ధరకు అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో యూరియా కోసం ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు.