రుణమాఫీ అంశంలో రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉంటూ ధైర్యం చెప్పేందుకు గులాబీ బాస్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు చేస్తున్న పోరాటానికి కేసీఆర్ తన మద్దతు తెలిపేందుకు రానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి రానున్నారు. రుణమాఫీ అంశంలో రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉంటూ ధైర్యం చెప్పేందుకు గులాబీ బాస్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు చేస్తున్న పోరాటానికి కేసీఆర్ తన మద్దతు తెలిపేందుకు రానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే కేసీఆర్ రైతుల తరఫున యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.
గురువారం ఆలేరులో నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పేరు మీద కాంగ్రెస్ మోసం చేసింది.. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడేమో రుణమాఫీ అందరికీ కాదు. కొందరికే అవుతుందని అంటున్నారని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. గ్యారంటీల పేరు చెప్పి ఎసెంబ్లీ ఎన్నికల ముందు నమ్మించి మోసం చేశారు. ఎంపీ ఎన్నికల సమయంలో దేవుళ్ళ మీద ఒట్టు వేసి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కొట్లాడినం.. బయట కూడా కొట్లాడుతున్నామని హరీష్ రావు అన్నారు.
రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేసీఆర్ ఆలోచించారని ఆయన అన్నారు. అందుకే 11 విడతల్లో రూ.72 వేల కోట్లను రుణమాఫీ కోసం కేటాయించారని ఆయన అన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంటలకు బోనస్ అని బోగస్ చేశారని మండిపడ్డారు. ఐటీ అని నిబంధనలు పెట్టీ కోతలు పెట్టారు. ఆశా వర్కర్లు, ఆంగన్‌వాడీలకు కోత పెట్టారని అన్నారు. తక్షణమే కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్ళు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధుల పెన్షన్ కూడా రావడం లేదని.. ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు.