న్యూస్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ పాలనలోనే రాష్ట్రంలో లెక్కలేనన్ని అక్రమ కట్టడాలు నిర్మించారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అదే కాంగ్రెస్ పార్టీ అక్రమ నిర్మాణాల పేరుతో నాటకాలాడుతోందని ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నగరంలోని పలు చెరువుల సమీపంలో పేదలు కట్టుకున్న ఇళ్లను ఆయన పరిశీలించారు. హస్మత్ పేట చెరువు పక్కన 125 మందికి, అల్వాల్ చెరువు దగ్గర ఉన్న 120 మందికి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన ఖండించారు. 60-70 గజాల్లో 50 ఏళ్లుగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో వారిని రోడ్డు మీదకు లాగడం సరికాదని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా.. ఆయనే తొలి ముఖ్యమంత్రి అన్నట్టు ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. 1956 నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించారు. 70 సంవత్సరాల కాలంలో 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ పాలించిన విషయాన్ని రేవంత్ మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టి గొప్ప పనిచేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి పేదల ఇళ్ల జోలికి వస్తే.. వారి కన్నీటికి కారణమైతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.