ఎస్సీ, బహుజనుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు వివక్ష చూపుతున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎస్సీ, బహుజనుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు వివక్ష చూపుతున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ. తిరుపతి, ఆసిఫాబాదు జిల్లా వాసి స్టేషన్ ఘనపూర్ సంక్షేమ గురుకుల హాండ్ బాల్ అకాడమీలో చదువుతున్నాడు. ఈ బాలుడు 10వ ఆసియా జూనియర్ పురుషుల హ్యాండ్ బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు భారత టీంలో సెలక్టు అయ్యాడు. కాగా, ఈ పోటీలు జోర్డాన్ దేశంలో జరుగుతుంది. ఈ బాలుడికి ప్రయాణానికి, కోచింగ్‌కు రూ. 2,20,000 కావలసింది. నిజానికి ఇలాంటి ప్రతిభ ఉన్న పేద పిల్లలను ప్రభుత్వమే పంపించాలని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో ఈ బాలుడి తండ్రి అప్పు చేసి రూ. 70,000 తీసుకొచ్చారని, మిగతావి వాళ్ల టీచర్లు మిగతా శ్రేయోభిలాషులు సమకూర్చి జోర్డాన్‌కు పంపించారని ప్రవీణకు కుమార్ తెలిపారు.
క్రికెటర్ సిరాజ్‌కు కోట్ల రూపాయల నజరానా, 600 గజాల స్థలం బంజారా హిల్స్‌లో కేటాయించగలిగినపుడు, ఈ బాలుడికి రెండు లక్షల రూపాయలు కూడా కేటాయించలేరా అని రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. అదే విధంగా అగసార నందిని ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన కూడా ఆమె మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా కరుణ కలగడం లేదని మండిపడ్డారు. బహుజన వర్గాలకు చెందిన అమ్మాయనేనా ఈ వివక్ష అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీ ఖజానాలో డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఎవరి జేబుల్లోకి చేరుతున్నాయి అని నిలదీశారు. బహుజన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇకనైనా నిద్ర లేవాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.