తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న అడ్వకేట్ జయశంకర్ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న అడ్వకేట్ జయశంకర్ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జీవిత లక్ష్యంగా బ్రతికిన వ్యక్తి జయశంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండా జయశంకర్ మరణించడం బాధాకరం అన్నారు. డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ తప్పక వస్తుందని జయశంకర్ చెప్పారు. జయశంకర్ స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన కోరారు.
జయశంకర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు సాధించలేరు అని జయశంకర్ చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అణువణువు జయశంకర్‌కు తెలుసు అన్నారు. తెలంగాణ వస్తే మిగులు బడ్జెట్ ఉంటుందని జయశంకర్ చెప్పారు. తెలంగాణ వస్తే అభివృద్ధి ఎట్లా ఉండాలో జయశంకర్ డ్రాఫ్ట్ ఇచ్చారని ఆయన అన్నారు. చిదంబరం ప్రకటన ఎట్లా ఉండాలో జయశంకర్ చెప్పారు. జయశంకర్ కుటుంబమే తెలంగాణగా మారిందని, జయశంకర్ తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేశారన్నారు. నేడు తెలంగాణలో జయశంకర్ విగ్రహం లేని జిల్లా లేదని, తెలంగాణ ప్రతిష్టను ఎవరు దెబ్బతీస్తున్నా పోరాటం చేయాలని జయశంకర్ చెప్పారు. నేడు రకరకాల ముసుగులో వచ్చి తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ప్రజలు ఏదో ఊహించి మార్పు కోరుకున్నారు. కానీ తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యుద్ధభూమిగా ఉండేదని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వరంగల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా తను జయశంకర్‌ను కలిశానాని, తెలంగాణలో ఎన్‌కౌంటర్లు లేకుండా నక్సలిజం సమస్యకు పరిష్కారం చూపాలని అడిగాని చెప్పారు. ఆంధ్రా పోలీసులు తెలంగాణ పోలీసులను ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జయశంకర్ పోలీసులకు దిశానిర్దేశం చేశారన్నారు. తెలంగాణ మళ్లీ ప్రమాదం అంచున ఉందని, దొడ్డిదారిన తెలంగాణ వనరులను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అమెరికాలో మీటింగ్ పెడితే అంతా ఆంధ్రా వారు వచ్చారు. తెలంగాణపై ఢిల్లీ నుంచి కుట్ర జరిగే అవకాశం ఉందని, అదృశ్య శక్తులు తెలంగాణను కబలించే అవకాశం ఉందని ప్రవీణ్ కుమార్ అన్నారు.