KTR: బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం

బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


Published Aug 13, 2024 03:55:43 PM
postImages/2024-08-13/1723544743_banswada.PNG

న్యూస్ లైన్ డెస్క్: బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు మంగళవారం నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డినీ అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించిందన్నారు. ఐతే కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్ద వాళ్లైనా సరే వదిలిపెట్టేది లేదని వారికి కచ్చితంగా కార్యకర్తలు బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని కనీసం అడిగిన వాళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చిందని చెప్పారు. 

రేవంత్ రెడ్డి పరిపాలన సమర్థత ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని.. మార్పు పేరుతో జనాన్ని ఏమారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బాన్సువాడ బై ఎన్నికల్లో కచ్చితంగా పోచారం ను ఓడిస్తామని చెప్పారు. త్వరలోనే ప్రశాంత్ రెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు సహా తాను బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదని...బీఆర్ఎస్ కు కార్యకర్తలే కొండంత అండ అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. బై ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ మారిన వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గులాబి జెండా మీద గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడినా.. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : india-people mla brs ktr pocharam-srinivas-reddy bansuwadamla

Related Articles