సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సింగరేణి ప్రైవేటీకరణ, ప్రస్తుతం ఉన్న కార్మికుల ఉద్యోగాల గురించి చర్చలు జరిగాయి.
న్యూస్ లైన్ డెస్క్: సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఇటీవల సింగరేణిలో పలు బ్లాకులను వేలం వేసిన విషయం తెలిసిందే. దీంతో సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై ప్రాంతీయ పార్టీ BRS కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన పార్లెమెంట్ సమావేశంలో సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సింగరేణి ప్రైవేటీకరణ, ప్రస్తుతం ఉన్న కార్మికుల ఉద్యోగాల గురించి చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల కొనసాగింపు, ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని కాంగ్రెస్ నేత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ డిమాండ్ చేశారు.
దీంతో దేశంలో ఏ బొగ్గుగనిని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణిని ప్రైవేటు చేసే వ్యవహారం అంతా.. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని ఆయన వెల్లడించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలంటే.. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ప్రధానంగా పరిగణలోకి వస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.