తాజగా ఈ విషయంపై ఆలయ అర్చకులు సీఎస్.రంగరాజన్ స్పందించారు. పెళ్లికాని వారి కోసం ఈ ఏడాది ఏప్రిల్ 21న కళ్యాణ ప్రాప్తి కార్యక్రమం చేయించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తూ గతంలో ఓ వీడియోను విడుదల చేశామని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎంత ప్రయత్నించినా పెళ్లి కాని వారు ప్రతి నెల 21న చిలుకూరులోని బాలాజీ ఆలయానికి వెళ్లాలని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గత కొంత కాలంగా ప్రతి నెలా 21న ఆలయంలో భక్తుల రద్దీ మరింత పెరిగిపోతోంది. ప్రతి నెలా 21న దగ్గరి ప్రాంతాల వారు మాత్రమే కాకుండా ఇతర జిల్లాలు, ఏపీ నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఓవైపు వర్షాకాలం, మరోవైపు 21న భక్తుల రద్దీ మరింత పెరిగిపోతుండడంతో ఆలయానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే, తాజగా ఈ విషయంపై ఆలయ అర్చకులు సీఎస్.రంగరాజన్ స్పందించారు. పెళ్లికాని వారి కోసం ఈ ఏడాది ఏప్రిల్ 21న కళ్యాణ ప్రాప్తి కార్యక్రమం చేయించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తూ గతంలో ఓ వీడియోను విడుదల చేశామని ఆయన అన్నారు. అయితే, అందులో ఏప్రిల్ 21 అని ఉంటే.. ఆ 'ఏప్రిల్' అనే పదాన్ని తీసేసి 21న పెళ్లి కాని వారి కోసం ప్రత్యేక పూజ కార్యక్రమం ఉంటుందనేలా ఎవరో వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పీసోత్ చేశారని ఆయన తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రతి నెలా 21న ఆలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పొరబడుతున్నారని ఆయన అన్నారు. దీంతో ప్రతి నెలా 21న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగిపోతుందని ఆయన తెలిపారు.
ఇటువంటి ఫేక్ వీడియోలతో భక్తులకు తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఆయన సూచించారు. వివాహ సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం ఏప్రిల్ 21న మాత్రమే ఆలయంలో కళ్యాణ ప్రాప్తి కార్యక్రమం నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. ఇది ప్రతి నెలా ఉండబోదని తెలిపారు.