కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే పంటలు ఎండిపోయి, అప్పుల బాధలు తాళలేక అనేక మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే వీరిని ఆదుకోవాల్సిన సర్కార్ మాత్రం చేతులు ఎత్తేసింది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దీనిపై సర్కారును నిలదీసింది. రాష్ట్రంలో 200మందికి పైగా ఆత్మహత్యలు జరిగాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అయితే దీనిపై విచారం వ్యక్తం చేసి ఆదుకోవాల్సిన రేవంత్ రెడ్డి వెటకారం చేశారు. వాళ్ల డిటెయిల్స్ 4రోజుల్లోగా ఇవ్వండి చూస్తామంటూ చెప్పారు. ప్రభుత్వంలో ఉండి రాష్ట్రంలో చనిపోయిన రైతుల వివరాలు లేకపోవడంపై అప్పట్లోనే ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అయ్యింది. రైతుల చావుల పట్ల రేవంత్ చులకనపై రైతులు మండిపడ్డారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఒక్కరోజులోనే ఆత్మహత్య చేసుకున్న రైతుల పేర్లు, వివరాలు, ఊర్లతో సహా ప్రభుత్వం ముందుపెట్టింది. అయినా ఇప్పటి వరకు సర్కారు నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో సవాల్ విసిరి మరీ పరువు తీసుకున్నట్టుగా అయ్యిందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి పైసా కూడా ఇవ్వలేదు బీజేపీ. దీనిపై ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీని నిలదీసి, కొట్లాడాలి. కానీ ఆయన మాట్లాడక పోగా.. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పైనే నెపం వేశారు. తనకేం తెలియదన్నట్టుగానే రేవంత్ వ్యవహారించారు. కేసీఆర్, కేటీఆర్ వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఆమరణ దీక్ష చేయాలన్నారు. ‘‘కేసీఆర్ సచ్చుడో.. రాష్ట్రానికి నిధులు వచ్చుడో‘‘ తేలాలంటూ రేవంత్ మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ఇలా మాట్లాడటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అలా ఎలా మాట్లాడతారంటూ హస్తం పార్టీలోని సీనియర్లే అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.2లక్షల రుణమాఫీ చేశామని హడావిడి చేసింది. కానీ చాలా మంది రైతులకు రుణమాణీ కాలేదు. వాళ్లు ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రుణమాఫీ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లను ఆదుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించాల్సిన రేవంత్, తిరిగి బీఆర్ఎస్ నే ముందుపెట్టారు. హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో సర్వే చేసి ఎవరెవరికీ మాఫీ కాలేదో వివరాలు కలెక్టర్లుకు ఇవ్వాలంటూ చెప్పారు. ప్రభుత్వ పెద్దగా ఉన్న వ్యక్తి.. సర్వే చేయాలంటూ ప్రతిపక్షానికి చెప్పడం ఏంటని చాలామంది సీనియర్ నేతలు తలపట్టుకున్నారట.
ఇక తాజాగా వరదలు, సహాయక చర్యల విషయంలోనూ మళ్లీ అదే పనిచేశారు రేవంత్ రెడ్డి. ఆదుకోవాలని కేంద్రాన్ని అడగాల్సింది పోయి బీఆర్ఎస్ నేతలు కేంద్రాన్ని అడగాలని, వాళ్లంతా ప్రజలను రక్షించకుండా ఏం చేస్తున్నారని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు వరదబాధితుల కోసం నిధులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇది కూడా విమర్శలకు కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి.. నేరుగా కేంద్రాన్ని అడగాల్సింది పోయి.. బీఆర్ఎస్ వాళ్లు వెళ్లి కేంద్రాన్ని అడగాలనడం ఏంటని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారట. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం సహజం. కానీ ప్రజల సమస్యలను, వాళ్ల బాధలను, రైతుల ఆత్మహత్యలను అవహేళన చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడడంపై సొంత పార్టీనుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అమలు చేయడం లేదని చర్చించుకుంటున్నారు. ప్రతీదానికి అపోజిషన్ పై నెట్టేయడం ద్వారా వాళ్లను ఇరుకున పెట్టానని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ అది తన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లు కూడా రేవంత్ స్టేట్ మెంట్లు చూసి నవ్వుకుంటున్నారని తెలుస్తోంది. అయితే.. కొన్ని సందర్భాల్లో ఎలా మాట్లాడాలో చెప్పే ప్రయత్నం చేసినా.. రేవంత్ పట్టించుకోవడం లేదని సమాచారం. దీంతో మాకెందుకులే అని సీనియర్లు కూడా లైట్ తీసుకుంటున్నారట.