రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 2వ తేదీన సమావేశం కానున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 2వ తేదీన సమావేశం కానున్నారు. ఆగస్టు రెండవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సమావేశ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం సంబంధిత ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ జితేందర్, ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరిగిందని, ఈ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులందరితో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడేందుకు ఆగస్టు రెండవ తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మందికి రైన్ ప్రూఫ్ టెంటు సౌకర్యం కల్పించాలని, వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు తగు పార్కింగ్ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశ ప్రాంగణంలో కావలసిన మంచినీరు పారిశుధ్యం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.