న్యూస్ లైన్ డెస్క్ : మొన్నటికి మొన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను సీఎం రేవంత్ ఆదేశాలతో కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సినీ ఇండస్ట్రీలోని పలువురు సీఎం రేవంత్ మీద కాస్త కోపంగానే ఉన్నారు. అయితే.. ఈ సమయంలో రేవంత్ రెడ్డి మరోసారి సినీ ఇండస్ట్రీ విషయంలో జోక్యం చేసుకున్నారు. నటి, ఎంపీ కంగనా రనౌత్ దర్శకత్వం వహించి.. తెరకెక్కించిన ఎమర్జెన్సీ మూవీ విడుదల విషయంలో సంచలన కామెంట్లు చేశారు.
భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం గురించి రూపొందించిన ఈ మూవీలో తమ గురించి తప్పుగా చూపించారంటూ సిక్కులు కోర్టుకెక్కారు. శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ తరపున ఇప్పటికే దర్శకురాలు కంగనా రనౌత్ కి, ఇతరులకు నోటీసులు అందయి. ఈ నెల 14న విడుదలైన మూవీ ట్రైలర్ లో పలు అభ్యంతరాలు చెప్తూ సిక్కులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దేశాన్ని ఏలిన తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ గురించి తప్పుగా చూపిస్తే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సిక్కులకు ఆయన సినిమా నిషేధించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఎమర్జెన్సీ సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశ ద్రోహులుగా చిత్రీకరించారని 18మంది సిక్కుల బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఆయన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రేవంత్ ఎమర్జెన్సీ సినిమాను నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.