కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్‌కు చెందిన భవనాన్ని కూల్చివేస్తామంటూ హైడ్రాకు సంబంధించిన జాబితాలో పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పలు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలకు సంబంధించిన కట్టడాల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
న్యూస్ లైన్ డెస్క్: చెరువులు, జలాశయాల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కమిషన్ ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. చెరువులు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు చెందిన కట్టడాలతో పాటు హీరో నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్‌ను కూడా కూల్చివేసిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు దాదాపు 100 ఎకరాల మేర నిర్మించిన పలువురికి చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా తెలిపింది. అనురాగ్ కాలేజ్ భవనం కూడా చెరువుకు సంబంధించిన స్థలంలో నిర్మించారనే ఆరోపణలతో BRS నేత పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసి హైడ్రా కమిషన్ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని BRS వర్గాలు ఆరోపిస్తున్నాయి.
కాంగ్రెస్ నేతలు, వారి కుటుంబీకులకు చెందిన అక్రమ కట్టడాలను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కీలక నేతకు సంబంధించిన ఓ అక్రమ కట్టడాన్ని కూల్చాలని హైడ్రా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. ఇందులో అధికార పార్టీ నాయకులు, వారి సన్నిహితులకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్‌కు చెందిన భవనాన్ని కూల్చివేస్తామంటూ హైడ్రాకు సంబంధించిన జాబితాలో పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పలు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలకు సంబంధించిన కట్టడాల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, BRS, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన నాయకుల అక్రమ నిర్మాణాలను కూడా ఉన్నాయి. దీంతో హైడ్రా ఇచ్చిన నివేదిక ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన కట్టడాలను కూడా కూల్చమని ప్రభుతం చెప్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.