న్యూస్ లైన్ డెస్క్: పచ్చని రంగులో మిషన్ భగీరథ నీరు వస్తుంది. దీంతో ఎలా తాగాలి అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. న్యాల్ కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని ఫిల్టర్ బెడ్ ద్వారా న్యాల్ కల్ మండలంతో పాటు ఝరాసంగం తదితర గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే నీరు సరిగ్గా ఫిల్టర్ చేయకపోవడం వల్ల పచ్చని రంగులో త్రాగునీరు సరఫరా కావడంతో గ్రామా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నీరు తాగితే ఎలాంటి జబ్బుల బారిన పడతామోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నెల రోజుల నుంచి ఇలాగే నీరు వస్తుందని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి ఫిల్టర్‌ను బాగుచేయించి తాగునీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.