ఇప్పుడు మంచానపడ్డ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు అనాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోన్న గురుకులాల ఘటనపై ఎమ్మెల్యే డా.కే.సంజయ్ స్పందించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలోని గురుకులాలను మూసివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు చనిపోయారని ఆయన గుర్తుచేశారు. దాదాపు 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని అన్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు ఫుడ్ ఫాయిజనింగ్ బారిన పడ్డారని.. అందులో ఇద్దరు చనిపోయారని ఆయన అన్నారు. పెద్దాపూర్ వద్ద ఓ విద్యార్థి చనిపోగా.. మరొకరు వెంటిలేటర్ మీద మృత్యువుతో పోరాడుతున్నారని వెల్లడించారు. ఇంతకు ముందు మంచానపడ్డ మన్యం అనే వార్తలు వచ్చేవి. కానీ, ఇప్పుడు మంచానపడ్డ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు అనాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆరోపించారు.
ఈ మరణాలపై ప్రభుత్వంలో ఏ స్థాయిలో సమీక్షలు జరగడం లేదని ఆయన అన్నారు. కేసీఆర్ హయాంలో 1200 ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. గురుకులాలను సమీక్షించేందుకు గతంలో సెంట్రల్ కమాండ్ సిస్టం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు విద్యార్థులు జబ్బు పడితే కనీసం మందులు అందుబాటులో లేవని విమర్శించారు. విద్యార్థులు పడుకునేందుకు కనీసం మంచాలు లేవు.. కింద పడుకోవడం వల్ల పాము కాట్ల బారిన పడుతున్నారని అన్నారు. రాజకీయాల జోలికి పోకుండా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.