ఆ భూమిలో 4 ఎకరాల 12 గుంటలు భూమి తన ఏకైక కుమారుడు మద్దెల రవికి గతంలో గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేశాడు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : వయసంతా కష్టపడి ..ఆస్తులు దాచి ..తిని ..తినక పిల్లల్ని పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసి ..వృధ్ధాప్యంలో వచ్చేసరికి రోడ్డున పడేసే కొడుకులకు ఈ పెద్దాయన చేసే పని తెలిస్తే గుండెల్లో గుబులు పుడుతుంది.ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్యకు ఐదెకరాల పైచిలుకు భూమి ఉంది. ఆ భూమిలో 4 ఎకరాల 12 గుంటలు భూమి తన ఏకైక కుమారుడు మద్దెల రవికి గతంలో గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేశాడు. చేసిన కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు. కాని తర్వాత తర్వాత తండ్రి పట్టించుకోవడం మానేసాడు.
సరైన తిండి పెట్టకుండా ఇబ్బందులు పెట్టాడు.దీంతో ఈ మధ్యకాలంలో కుమారుడు రవి తండ్రిని కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో రాజ కొమురయ్య మనస్తాపానికి గురై సమీపంలోని గుట్టల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడే ఉన్న గొర్రెల కాపరులు ఆయనను రక్షించి వారితో పాటే తీసుకెళ్లి భోజనం పెట్టించారు.
దీంతో ధైర్యం తెచ్చుకొని ...హుజురాబాద్‌లోని ఓ రైస్ మిల్లులో రాజ కొమురయ్య గేట్ కీపర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ కొమురయ్య పరిస్థితి తెలుసుకున్న కొంతమంది, సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కుమారుడికి ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. తెలిసిన వెంటనే ఫస్ట్ తన భూమిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు కొమరయ్య. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
కొన్ని రోజులకు రవి పేరిట ఉన్న 4 ఎకరాల 12 గుంటల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేసి తిరిగి రాజ కొమురయ్య పేరు మీద మార్చారు. పేరు మార్పిడి పట్టా పాస్ పుస్తకాన్ని స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ రాజ కొమురయ్యకు ఇచ్చారు. ఈ ఘటన చాలా మంది వృధ్ధులకు ఓ మంచి ఉదాహారణ. పేరెంట్స్ ను పట్టించుకోని వారి ఇది చెంపదెబ్బ.