రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్ : మూడు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటి వరకు కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 103.55 మీటర్లుగా నమోదైంది. వర్షాలు కురుస్తూనే ఉండటంతో మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ మేరకు నీటి పారుదల శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
గోదావరి పరివాహకంలో ఉన్న లోతట్టు గ్రామాలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కుంట్లం, పాల్గుల, అన్నారం, చండ్రుపల్లి, మద్దులపల్లి, నాగేపల్లి, కాళేశ్వరం, పుస్కుపల్లి, మాజీద్ పల్లి, మెట్ పల్లి, బీరసాగర్, పెద్దంపేట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.