ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌తో అల్లాడిపోతుంటే, రైతులు రుణమాఫీ కోసం రోడ్లెక్కుతుంటే ఈ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా, సమస్యలను పక్కదారి పట్టించేందుకు హైడ్రాతో హైడ్రామా నడిపిస్తుందని ఆయన విమర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రజల సమస్యలను పక్క దారి పట్టించే పాలన చేస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌తో అల్లాడిపోతుంటే, రైతులు రుణమాఫీ కోసం రోడ్లెక్కుతుంటే ఈ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా, సమస్యలను పక్కదారి పట్టించేందుకు హైడ్రాతో హైడ్రామా నడిపిస్తుందని ఆయన విమర్శించారు.
ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్డు దొరకడం లేదని ఒక అడ్మిషన్ ఇప్పించమని తమకు ఫోన్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గత సంవత్సరం కంటే ఇప్పడు 36 శాతం డెంగ్యు కేసులు పెరిగాయని వెల్లడించారు. కొన్ని వేల మంది డెంగ్యు, చికెన్ గున్యాతో బాధ పడుతున్నారని తెలిపారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు దొరకడం లేదని అన్నారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసింది, గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితి లేదని విమర్శించారు. స్వయంగా GHMC కమిషనర్ ఆమ్రపాలినే తన ఇంట్లో నుంచి చెత్త తీసుకొని వెళ్లడం లేదని చెప్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.