ప్రజారాజ్యంలో అణిచివేతలేనా, రైతులు బాధలు చెప్పుకునే హక్కు కూడా ప్రజలకు లేదా అని ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో ఆయన అనుచరులు ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రుణమాఫీ వివరాలపై రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులు విజయారెడ్డి, సరితలు గురువారం ఉదయం కొడంగల్ నియోజకవర్గంలోని రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు.
అయితే, రైతులతో మాట్లాడుతున్న తమ వద్దకు వెళ్లి రేవంత్ అనుచరులు దాడికి పాల్పడినట్లు సరిత తెలిపారు. తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తాకకుండా పరిహారం అవ్వాలని గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొండారెడ్డిపల్లిలో సరితా, విజయ రెడ్డి అనే జర్నలిస్టుల మీద దాడి చేయడం దారుణమని అన్నారు. ప్రజారాజ్యంలో అణిచివేతలేనా, రైతులు బాధలు చెప్పుకునే హక్కు కూడా ప్రజలకు లేదా అని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఒట్లు పెట్టారని గుర్తుచేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి మీద కూడా ఒట్టు వేశారని అన్నారు. మాట తప్పారు.. పాలకులే పాపం చేస్తే ఎలా అని అయన ప్రశ్నించారు. ప్రజలకు ఆ పాపం జరగవద్దని దివాలా కోరు సీఎంను క్షమించాలని, ప్రజలకు మంచి జరగాలని వేడుకున్నామని అన్నారు. ఆగస్టు 15 పోయింది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు.
రైతు ద్రోహం కాదు దైవ ద్రోహానికి రేవంత్ పాల్పడ్డారని ఆరోపించారు. నన్ను రాజీనామా చెయ్యి అన్నారు.. కానీ, హతాను అలా అననని ప్రజలకు మంచి చేయడమే తనకు తెలుసని హరీష్ రావు అన్నారు. మొత్తం రూ. 17 లక్షల రైతులకు రుణమాఫీ చేసేది ఉంది అని ఉత్తమ్ అంటారు.. పొంగులేటి రూ.12 వేల కోట్లు అన్నారు.. తుమ్మల గారు రూ. 17 వేల కోట్లు మాత్రమే చేశాం.. మొత్తం రూ.31 వేల కోట్లు చేసేది ఉందన్నారని తెలిపారు. అయ్యింది తక్కువ కానిది ఎక్కువ అని వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్పారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం.. ప్రతి ఒక్కరికీ రుణమాఫీ వచ్చేలా పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.