దుర్గం చెరువు FTL పరిధిలో అక్రమ కట్టడం నిర్మించారని చూపిస్తున్నందుకు తనతో పాటు, కెమెరా పర్సన్‌పై తిరుపతి రెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆమె వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: మీడియా స్వేచ్చను హరించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం దుర్గం చెరువు FTL పరిధిలో ఉందని హైడ్రా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్ తో తిరుపతిరెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
వార్తకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన తమపై తిరుపతి రెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించారని ఓ మహిళా జర్నలిస్ట్ వాపోయారు. కెమెరాను ఆఫ్ చేసేందుకు ప్రయత్నించారని.. ఇక్కడ వీడియోలు రికార్డ్ చేయకూడదని హెచ్చరించారని ఆమె వెల్లడించారు. మీడియాపై దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది. దుర్గం చెరువు FTL పరిధిలో అక్రమ కట్టడం నిర్మించారని చూపిస్తున్నందుకు తనతో పాటు, కెమెరా పర్సన్‌పై తిరుపతి రెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆమె వెల్లడించారు.
తాజాగా, ఈ అంశంపై హరీష్ రావు స్పందించారు. విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అడ్డుకోవడం, మీడియాపై దాడి చేయడం కాంగ్రెస్ పాలనలో అలవాటుగా మారిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన మరువకముందే.. రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటివద్ద మరో మహిళా జర్నలిస్టుకు అవమానం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, మీడియా స్వేచ్చను హరించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మీడియాపై జరుగుతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు.