వరుస వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
న్యూస్ లైన్ డెస్క్ : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో జూరాల, నాగార్జున సాగర్, శ్రీరాం సాంగర్, స్వర్ణ సాగర్ లతో పాటు పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 90వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో.. ప్రాజెక్టులోని 17 గేట్లు ఎత్తి 67 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 33వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వదిలారు. ప్రాజెక్టు నీటిమట్టం మొత్తం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317 మీటర్లకు చేరింది. జలాశయం నీటి నిల్వ 9.5 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 7.6 టీఎంసీల నీటినిల్వ ఉంది. జూరాల నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 99 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం సాగర్ లో 504 అడుగుల వరకు నీటి నిల్వ.. ప్రాజెక్టు నుంచి 9,874 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో సైతం భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 14వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1067 అడుగుల వద్దకు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ 80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నిర్మల్ లోని స్వర్ణ జలాశయానికి కూడా 6480 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1176 అడుగుల వద్ద ఉంది.