న్యూస్ లైన్ డెస్క్ : నగరంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై నజర్ పెట్టిన హైడ్రా మేడ్చల్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం నాడు జవహర్ నగర్ పరిధిలోని చెరువులను పరిశీలించారు. అంబేద్కర్ నగర్లోని ఇంద్రా చెరువు, డంపింగ్ యార్డ్ సమీపంలోని నాలా కబ్జాకు గురైనట్టు ఆయన తెలిపారు. మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌజ్ కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే కట్టారని హైడ్రా గుర్తించింది. అనుమతులు లేని కట్టడాలు, అక్రమ నిర్మాణాలు తమ దృష్టికి వచ్చాయన్నారు రంగనాథ్.
చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని.. ఎంతటి బడాబాబులైనా వదిలే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పేదలను మినహాయంచి మిగతా వారి ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తామన్నారాయన. పేదల ఇళ్లు అడ్డుగా చూపి తప్పించుకోవాలని చూస్తున్న బడాబాబులను వదిలే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపైనే హైడ్రా దృష్టి పెట్టడం ఒక రకంగా రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. సీఎం రేవంత్ కక్షపూరితంగానే హైడ్రా ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేశారని టాక్ వినిపిస్తోంది.