పలువురు అధికారులు హైడ్రా పేరు చెప్పి భయపెట్టి కొంతమంది దగ్గర భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తోంది. చెరువులు ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, నిర్మాణాలు తొలగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అయితే.. ఇదే అదునుగా భావించి పలువురు అధికారులు హైడ్రా పేరు చెప్పి భయపెట్టి కొంతమంది దగ్గర భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.
గతంలో అక్రమంగా చెరువులు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేసిన వారు.. హైడ్రా చర్యలకు గురి కాకుండా ఉండేందుకు పలువురు అధికారుల చుట్టూ తిరుగుతున్నారట. అయితే.. హైడ్రా పరిధిలో వర్తించే భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్న కొంతమందికి అధికారులే నేరుగా ఫోన్ చేసి హైడ్రా నుంచి తప్పించుకోవాలంటే చేతులు తడపాల్సిందే అని బెదిరిస్తున్నారట. దీంతో.. హైడ్రా కోరల నుంచి తప్పించుకునేందుకు చాలామంది అధికారులకు డబ్బులు చెల్లిస్తున్నారట. గతంలో ఇచ్చిన నోటీసులు, ఫిర్యాదులను అడ్డు పెట్టుకొని రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు వసూళ్లకు దిగారట. ఈ విషయం తెలిసిన ఏసీబీ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి హైడ్రా పరిధిలో పనిచేసే అధికారులపై నిఘా పెట్టారు.