రజాకార్ల చేతిలో పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ క్రూరంగా హత్యకావించబడ్డ రోజు ఇవ్వాళ. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్బంగా ప్రత్యేక కథనం.
న్యూస్ లైన్ స్పెషల్ డెస్క్: తన ఇమ్రోజ్ పత్రికలో నిరంకుశ నిజాం, దేశ్‌ముఖ్‌ల పాలనకు వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు రజాకార్ల చేతిలో పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ క్రూరంగా హత్యకావించబడ్డ రోజు ఇవ్వాళ. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్బంగా ప్రత్యేక కథనం.
షోయబ్ ఉల్లా ఖాన్ 17 అక్టోబర్ 1920న ఖమ్మం జిల్లాలో జన్మించారు. తండ్రి హబీబ్ ఉల్లా ఖాన్, తల్లి లాయహున్నీసా బేగం. ఉస్మానియా యూనివర్శిటీలో బీఏ జర్నలిజం పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత తేజ్ అనే ఉర్దూ పత్రిక ద్వారా పాత్రికేయ ప్రస్థానం మొదలు పెట్టారు. అప్పటికే నిజాం నిరంకుశ పాలన రజాకార్ల దౌర్జన్యాలను చూసి రగిలి పోయిన ఆయన తేజ్ పత్రిక వేదికగా అక్షర పోరాటాన్ని ప్రారంభించారు. ప్రజల్లో చైత్యన్యాన్ని రగిలిస్తూ నిజాం అరాచకాలపై నిలదీశారు.
ఈ అక్షర పోరాటం ఇలాగే కొన సాగితే తమ సామ్రాజ్య పునాదులు కదిలిపోతాయని గ్రహించిన నిజాం వెంటనే తేజ్ పత్రికపై నిషేధం విధించారు. కానీ అక్కడితో ఆయన పోరాటం ఆగలేదు. తన పోరాటానికి అనువైన వేదిక కోసం వెతుకులాట మొదలు పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయనకు రయ్యత్ పత్రిక రూపంలో ఒక అద్బుతమైన అవకాశం లభించింది. మళ్లీ ఆయన తన కలాన్ని ఝుళిపించాడు. నిజాం రాజ్యంలో జరుగుతున్న హింసాకాండపై తన రచనల ద్వారా విరుచుకు పడ్డారు. దీంతో నిజాం రాజుకు కంటి మీది కునుకు లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో మరోసారి నిషేధం అనే అస్త్రాన్ని ప్రయోగించి షోయబ్ ఉల్లా ఖాన్ ను అడ్డుకునేందుకు నిజాం ప్రయత్నించారు. రయ్యత్ పత్రికపై నిజాం నిషేధంతో షోయబ్ ఉల్లా ఖాన్ పోరాటానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఇలా అయితే కుదరదని, తన పోరాటానికి ఒక శాశ్వతమైన వేదిక కావాలని ఆయన అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన భార్య నగలను తాకట్టు పెట్టి ఇమ్రోజ్ అనే పత్రికను మొదలు పెట్టారు. మళ్లీ ఆయన పోరాటం వేగం పుంజుకుంది. ఈ సారి సునామీ కన్నా బలంగా ఆయన పోరాటం దూసుకు వచ్చింది.
ఓ వైపు రైతాంగ పోరాటంపై వార్తలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఇంకో వైపు ఆర్య సమాజ్ పోరాటాన్ని వార్తల ద్వారా జనంలోకి తీసుకు వెళ్లారు. మరోవైపు భారత్ లో నిజాం రాజ్యం విలీనం కావాలంటూ జాయిన్ ఇండియా మూవ్ మెంట్ కు అనుకూలంగా కథనాలు రాశారు. ఇలా నిజాం ప్రభువుపై అన్ని వైపుల నుంచి తన కథనాల ద్వారా షోయబ్ ఉల్లాఖాన్ అక్షర దాడిని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రచనలు ఆపకుంటే షోయబ్ ఉల్లాఖాన్ చేతులు నరికి వేస్తామంటూ రజాకార్ల నుంచి హెచ్చరికలు వచ్చాయి. కానీ నమ్మిన సిద్దాంతం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని వ్యక్తి షోయబ్ ఉల్లాఖాన్ అందుకే రజాకార్ల హెచ్చరికలను లెక్క చేయకుండా తన అక్షర పోరాటాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే 1948 అగస్టు 21న కాచిగూడలో ఇమ్రోజ్ కార్యాలయంలో పని పూర్తి చేసుకుని వస్తున్న షోయబ్ ఉల్లా ఖాన్‌ను రజాకార్ల గూండాలు చుట్టు ముట్టారు. ఒక్కసారిగా ఆయనపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా 1948 ఆగస్టు 22న తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.