కాంగ్రెస్ కారణంగానే తమకు రాజకీయ అస్తిత్వం ఉందని చెప్పుకోవడం చూస్తుంటే చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అర్ధం అవుతోందని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీలో BRS ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ఆమె కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చరిత్ర, నిజం ఏంటో తెలుసుకొని మాట్లాడాలని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి ఇచ్చిన అవకాశాల పట్ల, ఉమ్మడి ఏపీ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, సోనియాగాంధీ అంటే ఎనలేని గౌరవం ఉందని ఆయన తెలిపారు. కానీ, కాంగ్రెస్ కారణంగానే తమకు రాజకీయ అస్తిత్వం ఉందని చెప్పుకోవడం చూస్తుంటే చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అర్ధం అవుతోందని వెల్లడించారు.
1985 సంవత్సరంలో MLA ఎన్నికై సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. 1989, 1994లో కూడా గెలిచి రాష్ట్ర హోం మంత్రిగా పని చేశారన్నారు. 1995 రాజకీయ సంక్షోభంలో పదవులను సైతం లెక్క చేయకుండా నమ్మిన NTR వెంట ఉన్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సోంతంగా జై తెలంగాణ పార్టీ స్థాపించి, రాష్ట్ర మొత్తం తిరిగి టైగర్ ఇంద్రారెడ్డిగా పెరుతెచ్చుకున్నారని కార్తీక్ రెడ్డి తెలిపారు. రాజశేఖరరెడ్డిపై గౌరవంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారని వెల్లడించారు. మరణించేంత వరకు తన తండ్రి కాంగ్రెస్‌లోనే ఉన్నారని కార్తీక్ రెడ్డి అన్నారు. పలు అనివార్య కారణాల వల్ల తన తల్లి సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని తెలిపారు.
2004 నుంచి 2009లో రాజశేఖరరెడ్డి మరణించే వరకు ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని వెల్లడించారు. ఆయన మరణం తరువాత సొంత పార్టీకి చెందిన వారే CBI కేసులు పెట్టి వేదించినా పార్టీని వీడలేదని తెలిపారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 2014, 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో, కుటుంబానికి ఒక్కటే టిక్కెట్ అని చెప్పి తమ కుటుంబానికి అన్యాయం చేశారని కార్తీక్ రెడ్డి ఆరోపించారు.
కానీ, చాలా కుటుంబాలకు రెండేసి టిక్కెట్లు ఇచ్చారు. పార్టీతోనే ఉన్న తమకు మొండి చేయి చూపించారని అన్నారు. అయినప్పటికీ పార్టీని వదిలి వెళ్లలేదని వెల్లడించారు.తమకు రాజకీయ జీవితమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో సొంత పార్టీకి చెందిన వారే కక్షగడితే.. తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చిందని కార్తీక్ రెడ్డి తెలిపారు. చరిత్ర, నిజం ఏంటో తెలుసుకొని భట్టి మాట్లాడాలని ఆయన సూచించారు.