హైదరాబాద్ ORR దగ్గరలోని 51 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద నిర్ణయాన్ని హడావిడిగా ఎందుకు తీసుకున్నారు.. ఎవరితో చర్చించారు? అని వివేకానంద్ ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి దురాశ దుఃఖానికి చేటు అని ఖుత్బుల్లాపూర్ BRS ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన అయన.. పంచాయతీలను శివారు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. హైదరాబాద్ ORR దగ్గరలోని 51 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద నిర్ణయాన్ని హడావిడిగా ఎందుకు తీసుకున్నారు.. ఎవరితో చర్చించారు? అని వివేకానంద్ ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత, అసమర్ధ నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత మంది BRS ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరిహతో కూడా చర్చించరా అని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ సీఎం దగ్గరే ఉంది.. ఎవరితో మాట్లాడకుండా నిర్ణయం తీసుకుంటారా? అని అయన మండిపడ్డారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించకుండా నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. సీఎంకు అవగాహన లేకపొతే వేరొక్కరికి మున్సిపల్ శాఖ అప్పగించాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో ప్రజాపాలన పోయి ఆర్డినెన్స్‌ల పాలన వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ORR లోపల మున్సిపాలిటీలను కలిపి హైదరాబాద్ మహా కార్పొరేషన్ చేయాలని జూలైలో సర్క్యూలర్ జారీ చేశారు.. దానికి విరుద్ధంగా ఇపుడు నిర్ణయం వచ్చిందని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా శివారు గ్రామాలు హైదరాబాద్‌తో సమానంగా పన్నులు కట్టాలా? అని వివేకానంద్ ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో హడావుడిగా కలపడం వల్ల ప్రజలపై భారమే తప్ప లాభం లేదని ఆయన అన్నారు.
హైడ్రా పేరుతో వసూళ్ల కార్యక్రమం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కూల్చివేతలకు ఏ గైడ్‌లైన్స్ లేవని వెల్లడించారు. సీఎం అనాలోచిత చర్యలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోందని అన్నారు. సీఎంకు పాలనా అనుభవం లేక ప్రజలకు కష్టాలు వస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు నిర్ణీత వ్యవధిలో మున్సిపల్ ఎన్నికలు పెట్టే అలవాటు లేదని ఆయన విమర్శించారు.