కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ థర్డ్ రేటెడ్, నీచ రాజకీయాలను గమనిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.
న్యూస్ లైన్ డెస్క్: సిద్ధిపేటలోని మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీసు వద్ద శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు హైడ్రామా సృష్టించారు. క్యాంపు ఆఫీసు ఫ్లెక్సీలను చించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై BRS వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గుండాల దాడి ఓక పిరికిపందల చర్య అని అన్నారు.
గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు దూరంగా ఉందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ థర్డ్ రేటెడ్, నీచ రాజకీయాలను గమనిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.
ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అని మాట్లాడుతూ ఉంటే ఆయన పార్టీ తెలంగాణలో నఫ్రత్ కా దుకాణ్ అంటూ హింసను ప్రేరేపిస్తోందని ఆయన విమర్శించారు. ఇదేనా రాహుల్ గాంధీ వల్లె వేస్తున్న మొహబ్బత్ కా దుకాణ్? అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకుడిని అని ప్రకటించుకున్న రాహుల్ గాంధీ చేస్తున్న రాజ్యాంగ విలువల పరిరక్షణ ఇదేనా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గాలకు రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలని కేటీఆర్ అన్నారు.