BRS నాయకులు, కార్యకర్తలు తిరగబడితే ఒక్కరు కూడా మిగిలే వారు కాదని ఆయన అన్నారు. కానీ హింస సమాధానం కాదు కాబట్టి BRS వాళ్లు గమ్మున ఉన్నారని ఆయన తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి.. నీకు దమ్ముంటే, మగాడివైతే సెక్యూరిటీ లేకుండా ఊళ్లలోకి రా.. అని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ దాడులపై డీజీపీ జితేందర్ కు ఫిర్యాదు చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి, జర్నలిస్ట్ శంకర్‌పై దాడికి ప్రయత్నాలపై ఆయన స్పందించారు.
గాదరి కిశోర్ కుమార్ నాయకత్వంలో రైతులతో శాంతి యుతంగా నిరసన తెలుపుతుంటే.. కాంగ్రెస్ గుండాలు తాగిన మత్తులో పోలీసులతో కుమ్మక్కై బాంబులతో నిసరసన శిబిరంపై దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. BRS నాయకులు, కార్యకర్తలు తిరగబడితే ఒక్కరు కూడా మిగిలే వారు కాదని ఆయన అన్నారు. కానీ హింస సమాధానం కాదు కాబట్టి BRS వాళ్లు గమ్మున ఉన్నారని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో రుణమాఫీ గురించి అడగడానికి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. రుణమాఫీ పూర్తిగా జరిగితే మహిళా జర్నలిస్టులపై దాడి చేసే అవసరం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు మహిళల మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని ఆయన అన్నారు. అక్కడ నుండి వెల్డండ పోలీస్ స్టేషన్ వరకు జర్నలిస్ట్ శంకర్, న్యూస్ లైన్ టీంను సినిమా తరహాలో దాడి చేయడానికి వెంబడించారని కేటీఆర్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నికృష్ట తీరుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తీరు నిదర్శనంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశారని ఆడబిడ్డలపై దాడి చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ జరగలేదనే బండారాన్ని బయటపెట్టినందుకే జర్నలిస్టులపై దాడికి పాలపడ్డారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం సొంత ఊర్లోనే అవమానం జరిగిందని కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇల్లు బఫర్ జోన్లో ఉన్నా, FTLలో ఉన్నా వెంటనే కూలగొట్టండని హైడ్రాకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేటీఆర్.. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయని తెలిపారు. హైడ్రా ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, V6 వివేక్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిల అక్రమ కట్టడాలను కూల్చి, ఆ తర్వాత సామాన్య ప్రజల కట్టడాల దగ్గరికి వెళ్లాలని ఆయన అన్నారు.