కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం ఐదు బ్యాంకులు ఉన్నాయి. ఐదు బ్యాంకుల్లో మొత్తం 20,239 ఖాతాలు ఉన్నాయి.. మూడు విడతల్లో సీఎం సొంత నియోజకవర్గం కోస్గి మండలంలో 8527 మందికి రుణమాఫీ అయ్యిందని తెలిపారు. అది కూడా పాక్షికంగా మాత్రమే అయిందని కేటీఆర్ తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు స్వరాజ్యం అనేది లేదని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది రైతులను హింసిస్తున్న రాజ్యమని, అన్నదాతలను ఏడిపిస్తున్న రాజ్యమని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని ఆయన తెలిపారు. కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం ఐదు బ్యాంకులు ఉన్నాయి. ఐదు బ్యాంకుల్లో మొత్తం 20,239 ఖాతాలు ఉన్నాయి.. మూడు విడతల్లో సీఎం సొంత నియోజకవర్గం కోస్గి మండలంలో 8527 మందికి రుణమాఫీ అయ్యిందని తెలిపారు. అది కూడా పాక్షికంగా మాత్రమే అయిందని కేటీఆర్ తెలిపారు.
రుణమాఫీ అనేది కేవలం 20, 30 శాతమే అయిందని.. ధోకా మాత్రం వంద శాతం జరిగిందని కేటీఆర్ అన్నారు. అందుకే రైతులకు మద్దతుగా ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నామని వెల్లడించారు. అన్ని మండల కేంద్రాల్లోని రైతులతో కలిసి BRS నిరసన చేపట్టనుందని తెలిపారు.
నిరసనలను ప్రారంభించే ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంటే సీఎం బజారు మాటలు మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ తల్లిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చేయాలని అన్నారు. తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరాలని కేటీఆర్ సూచించారు.
BRS అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. భారత రైతు సమితి అని కేటీఆర్ అన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు. ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పటి లోపు చేస్తారో కూడా స్పష్టం చేయాలని ఆయన అన్నారు.