రాత్రి సమయంలో ఠాణాకు తీసుకొని వెళ్లి.. కొడుకు ముందే చీర తీసేసి నిక్కర్ తొడిగి లాఠీ ఛార్జ్ చేసినట్లు ఆ మహిళ ఆరోపించింది.
న్యూస్ లైన్ డెస్క్: షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డి సస్పెండ్ అయ్యారు. ఓ దళిత మహిళను అరెస్ట్ చేసి.. విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేసినందుకు ఆయనపై హైదరాబాద్ సీపీ అవినాష్ మహంతి చర్యలు తీసుకున్నారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సునీత అనే దళిత మహిళపై పోలీసులు క్రూర చర్యకు పాల్పడ్డారు. దొంగతనం కేసులో ఆమెతో పాటు ఆమె భర్త, కుమారుడిని కూడా హింసించినట్లు సమాచారం.
బంగారం దొంగించిందనే ఆరోపణలతో ఆమెపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. రాత్రి సమయంలో ఠాణాకు తీసుకొని వెళ్లి.. కొడుకు ముందే చీర తీసేసి నిక్కర్ తొడిగి లాఠీ ఛార్జ్ చేసినట్లు ఆ మహిళ ఆరోపించింది. దీంతో ఆ విషయం రాష్ట్రవ్యాప్తంగా దుమారంగా మారింది. సోమవారం ఉదయం ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. మహిళను చిత్ర హింసలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే సీపీ అవినాష్ మహంతి రామిరెడ్డితో పాటు మరో ఐదుగురిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ పేరుతో దళిత మహిళను హింసించిన వారిపై సస్పెన్షన్ వేటు పడింది. షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి ఈ ఘటనపై విచారణ జరిపారు. అనంతరం రిపోర్టును సీపీ అవినాష్ మహంతికి అందించారు. రిపోర్టును పరిశీలించిన ఆయన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో ఐదుగురు కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు.