తొలి విడతగా 0 నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలకు రూ.6,098 కోట్లను విడుదల చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండో విడతగా 0 నుంచి రూ.1.50 లక్షల వరకు ఉన్న రైతులకు, మూడో విడతగా 0 నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు నెల పూర్తికాక ముందే రూ.31 వేల కోట్లను రైతు రుణ ఖాతాల్లో వేసి రుణ విముక్తులను చేస్తామని సీఎం అన్నారు. గత ప్రభుత్వం జీతాలు సరిగా ఇవ్వలేకపోయిందని, ఆర్థిక ఇబ్బందులున్నా ఎనిమిది నెలల కాలంలోనే రూ.29 వేల కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రుణమాఫీ చేయలేమంటూ మాకు సవాల్ విసిరిన వారిని రాజీనామా చేయమని తాము అడగమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పొంగిపోయారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. రుణమాఫీ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలతో హడావుడి చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలపై పాలు పోస్తూ ఆనందంతో డ్యాన్సులు చేస్తూ కనిపించారు. గాంధీ భవన్ దగ్గర బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే లక్ష లోపు రుణం ఉన్నా చాలా మందికి మాఫీ కాకపోవడంపై విశేషం.
రాష్ట్ర సచివాలయంలో గురువారం రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి విడతలో 11 లక్షల మందికి లక్షలోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేశారు. దీనికి గానూ రూ.6,098 కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 577 రైతు వేదికల్లోని అన్నదాతలు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయా రైతు వేదికల దగ్గరున్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్వయంగా మాట్లాడారు. ఇప్పటి వరకు ఆ మోడల్, ఈ మోడల్ అని పలువురు చెప్పుకున్నారని, రూ.2 లక్షల రైతు రుణమాఫీతో ఇక నుంచి తెలంగాణ దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, నమూనాగా నిలుస్తుందన్నారు. జడ్పీటీసీ సభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పార్లమెంట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పని చేశానని చెప్పుకొచ్చారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ రోజు మరుపురాని రోజన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతల హామీ ప్రకారం.. మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
తొలి విడతగా 0 నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలకు రూ.6,098 కోట్లను విడుదల చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండో విడతగా 0 నుంచి రూ.1.50 లక్షల వరకు ఉన్న రైతులకు, మూడో విడతగా 0 నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు నెల పూర్తికాక ముందే రూ.31 వేల కోట్లను రైతు రుణ ఖాతాల్లో వేసి రుణ విముక్తులను చేస్తామని సీఎం అన్నారు. గత ప్రభుత్వం జీతాలు సరిగా ఇవ్వలేకపోయిందని, ఆర్థిక ఇబ్బందులున్నా ఎనిమిది నెలల కాలంలోనే రూ.29 వేల కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రుణమాఫీ చేయలేమంటూ మాకు సవాల్ విసిరిన వారిని రాజీనామా చేయమని తాము అడగమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీని నెరవేర్చిందన్నారు. ఒకేసారి మొదటి దఫాలో రూ.31 వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేస్తున్నదుకు సంతోషంగా ఉందన్నారు. దీనిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. తొలి దశలో చేస్తుంది ఆరు వేల కోట్లు మాత్రమే అయితే ఒకేసారి రూ.31వేల కోట్లు అంటారేంటని విమర్శించారు. సీఎం ఒకలా మాట్లాడితే, డిప్యూటీ సీఎం మరోలా మాట్లాడుతున్నారని, ఇద్దరికీ పొంతనే లేదని అన్నారు.
ఇక కాంగ్రెస్ శ్రేణులు రైతు వేదికల దగ్గర హల్ చల్ చేశాయి. పాలాభిషేకాలతో సందడి చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలపై పాలు పోస్తూ డ్యాన్సులు చేశారు. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. కొన్ని చోట్ల రైతుల కంటే కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువగా ఉండటం విశేషం. రైతు వేదికలలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఇతర ఎమ్మెల్యేలు, కాంగ్రస్ పార్టీ సీనియర్ నేతలు, కలెక్టర్లతో పాటు వీడియో కాన్ఫరెన్సులలో పాల్గొన్నారు. రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు.
రుణమాఫీకి పాస్ బుక్ కొలబద్ద
రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని, రుణమాఫీకి పాస్ బుక్‌నే కొలబద్ద అని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. భూమి ఉండి, ఆ భూమికి పాసు బుక్ ఉండి, పాసు బుక్‌పై రుణం తీసుకుంటే దానిని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. దీనిపై అవగాహన కల్పించాలని ఆయన అధికారులు, రైతు వేదికల్లోని రైతులను కోరారు. రుణమాఫీకి సంబంధించి విద్యలేని, సాంకేతిక నైపుణ్యం లేని రైతులెవరికైనా సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేయాలని తాము బ్యాంకు అధికారులను కోరామని, అందుకు వారు అంగీకరించారని, అలా అంగీకరించినందుకు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము చేరేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రైతు అని, ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తారని, ఏ సమయం వచ్చినా, సందర్భం వచ్చినా రైతు సమస్యలపైనే మాట్లాడుతుంటారన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి రైతు సమస్యలను తెలుసుకున్నారని గుర్తు చేశారు.
ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తా.!
గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ హామీ ఇచ్చి నిలుపుకున్నందున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేకు ధన్యవాదాలు తెలుపుదామా అని ముఖ్యమంత్రి రైతు వేదికల్లో ఉన్న రైతులను అడిగారు. అందుకు సమ్మతిస్తూ అంతా చప్పట్లతో ఆమోదం తెలపడంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు కృతజ్ఞత తీర్మానాన్ని ఆమోదించారు. రైతుల అనుమతితో తాను, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. ఏ వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రుణమాఫీ హామీ ఇచ్చామో అక్కడే కృతజ్ఞత సభ పెడతామని, ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించి రాష్ట్ర రైతుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.