తెలుగు మాసాల్లో ఎంతో శుభప్రదమైనది శ్రావణమాసంలో శ్రీ మహాలక్ష్మి నేలమీద నడుస్తుందని నమ్ముతారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు మాసాల్లో ఎంతో శుభప్రదమైనది శ్రావణమాసంలో శ్రీ మహాలక్ష్మి నేలమీద నడుస్తుందని నమ్ముతారు. ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవని చిలకమర్తి తెలిపారు. అలాగే జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య ఇలా ప్రతి రోజు చాలా ముఖ్యమైన రోజులు.
బంగారం, వెండితోపాటు వస్త్రాలు కొనుగోలు చేయడానికి ఇది శుభప్రదమైన మాసమని చెప్పారు. పెళ్లి కాని వారు మంచి భర్త కోసం నోములు, వ్రతాలు చేయడానికి ఈ నెలలోనే సన్నద్ధమవుతారు. గుమ్మాలకు పచ్చతోరణాలు కట్టి పసుపు రాసి కుంకుమ , బియ్యం పిండితో పెట్టిన ముగ్గులు అంతా తెలుగుదనం ఉట్టిపడేలా చేస్తుంది.శ్రావణమాసంలో వచ్చే నాలుగు సోమవారాలు శివభక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకం, రుద్రాభిషేకం చేస్తారు. మంగళవారం పూట సౌభాగ్యం కోసం మంగళగౌరీ పూజలు చేస్తారు. అమ్మవారి పూజలు ఈ శ్రావణ మంగళవారం చాలా బాగా చేస్తారు.
మంగళగౌరీదేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. అందుకే పెళ్ళయిన ప్రతి మహిళ శ్రావణ మంగళవారాల నోము నోచుకోవడం అనాదిగా వస్తోంది. అయితే ఈ పూజ తల్లితో కాని , గురువుతో కాని మొదటి పూజ చేసేటపుడు తాంబూలం ఇస్తే చాలా మంచిది. పసుపు, కుంకుమ, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఆవునేతిలో మంగళగౌరి ఉంటుంది. అందుకే వాటినన్నింటినీ ఈ వ్రతానికి ఇవన్నీ తప్పకుండా వాడతారు. మంగళ గౌరీ వ్రతం లో కాటుక కూడా చాలా ముఖ్యం. ముత్తైదువులకు కాటుక పెట్టి ఇస్తారు.
మంగళగౌరి వ్రతానికి కావలసిన పూలు, పళ్ళు, శనగలు (నానపెట్టినవి), పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు మొదలైన సామగ్రిని సమకూర్చుకోవాలి. పసుపురాసిన దారానికి పువ్వులు, మాచుపత్రికానీ, దమనంకానీ కట్టి తోరణాలు తయారుచేస్తారు. వాటిని పూజచేసేటప్పుడు గౌరీదేవి మీద పెట్టి పూజ అయిన తర్వాత ఒకటి గౌరీదేవికి ఉంచి, రెండు తీసి ఒకటి ముత్తైదువుకు వాయనంగా ఇస్తారు. ఈ మాసంలో ఏ రోజైన ఆడవారికి అలంకరణ వస్తువులు దానం చేస్తే చాలా మంచిది.
వాయనం ఇచ్చినప్పుడు సౌభాగ్య ప్రదాయిని శ్రావణ గౌరి 'సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే ॥ శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణీ నమోస్తుతేస ॥ అని అమ్మవారిని ఆరాదిస్తారు.గౌరీదేవిని పూజిస్తే మంచి భర్త లభిస్తాడని పెళ్లికాని కన్యలు విశ్వసిస్తారు. ముఖ్యంగా పెళ్లైన ఆడపిల్లలు ఎందుకు వద్దంటారంటే ..వైధవ్యం నుంచి తప్పించే శక్తి ఈ వ్రతానికి ఉందని నమ్ముతారు.