న్యూస్ లైన్ డెస్క్ : అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఒక్క గుడ్డు రెండు ముక్కలు చేసి ఇద్దరికి ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించారు. అంగన్ వాడీల్లో అందించే సేవలు మరింత మెరుగు పరిచేలా ప్రభుత్వం పని చేస్తుందని ఆమె అన్నారు. అంగన్వాడీ టీచర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఆయాలకు కూడా వర్తించేలా చూస్తామని మంత్రి అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె జిల్లా అధికారులతో మాట్లాడారు.
పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డు రెండు ముక్కలుగా చేసి ఇస్తే చిన్నారులకు తినేందుకు వీలుగా ఉంటుందని మంత్రి అన్నారు. ఒకవేళ గుడ్డులో ఏదైనా పాడైపోయినా సులభంగా గుర్తించవచ్చని సీతక్క అన్నారు. త్వరలోనే అంగన్ వాడీలకు ఆహార పదార్థాలు నిర్వహించే వస్తువులు, రాక్ లు అందిస్తామని హామీ ఇచ్చారు. అంగన్ వాడీ నుంచి గర్భిణీలు తీసుకెళ్లే వస్తువుల నాణ్యతను లబ్ధిదారుల నుంచి లిఖితపూర్వకంగా నమోదు చేయాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇకపై అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తామని మంత్రి అన్నారు.