మరోవైపు జరుగుతున్న అతర్గత ఘర్షణలు చూస్తుంటే కాంగ్రెస్‌లో తిరుగుబాటు మొదలైనట్లు అర్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకే ప్రాధాన్యం అంటూ మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. మక్తల్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సప్ గ్రూపులో ఆయన చేసిన మెసేజ్‌లు లీక్ అయ్యాయి. 'ఇది ప్రజా పాలనా.. రెడ్డి పాలనా..! ఎవని పాలయ్యిందిరో తెలంగాణ..!' అంటూ కాంగ్రెస్ కార్యవర్గానికి సంబంధించిన జాబితాను ఆయన షేర్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మినహా అందరూ రెడ్డి వర్గానికి చెందిన వారే. అయితే ఈ అంశంపై అప్పట్లో చాలానే చర్చలు జరిగాయి. అగ్రవర్గానికి చెందిన వారికే కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేసిందనే వాదనలు వినిపించాయి. కాగా, ఈ మంత్రివర్గం కూడా తాత్కాలికమేనని, ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు త్వరలోనే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా తరచుగా ఢిల్లీకి వెళ్లి రావడానికి కూడా ఇదే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఇలా ఉంటే, మరోవైపు జరుగుతున్న అతర్గత ఘర్షణలు చూస్తుంటే కాంగ్రెస్‌లో తిరుగుబాటు మొదలైనట్లు అర్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకే ప్రాధాన్యం అంటూ మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. మక్తల్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సప్ గ్రూపులో ఆయన చేసిన మెసేజ్‌లు లీక్ అయ్యాయి. 'ఇది ప్రజా పాలనా.. రెడ్డి పాలనా..! ఎవని పాలయ్యిందిరో తెలంగాణ..!' అంటూ కాంగ్రెస్ కార్యవర్గానికి సంబంధించిన జాబితాను ఆయన షేర్ చేశారు.
అందులో ఉన్న సభ్యులంతా రెడ్డి వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. అయితే, ఎంపీ ఎన్నికల ముందు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇస్తామని జన జాతర సభలో రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వాకిటి శ్రీహరికి పట్టం కట్టే అవకాశం అయితే కనిపించడం లేదు.
దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ ఆయన వాట్సప్ గ్రూప్ లో చేసిన మెసేజ్‌లు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.