పార్టీ ఫిరాయింపులపై గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా లేఖలో పొందుపరుస్తామని అన్నారు. పార్టీల చేరికలతో శునకానందం పొందుతున్న కాంగ్రెస్ నేతలు.. ఇతర పార్టీలను దెబ్బతీశామని భావిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యల ద్వారా పాలన విషయంలో ప్రజలకు సంతృప్తిని ఇవ్వలేరని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా లేదా అనే అంశాలను ప్రజలు చూస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని BRS నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పార్టీలు మారుతున్న నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పాల్గొని గెలిచి చూపించాలని నిరంజన్ రెడ్డి సవాల్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాస్తున్నామని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులపై గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా లేఖలో పొందుపరుస్తామని అన్నారు. పార్టీల చేరికలతో శునకానందం పొందుతున్న కాంగ్రెస్ నేతలు.. ఇతర పార్టీలను దెబ్బతీశామని భావిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యల ద్వారా పాలన విషయంలో ప్రజలకు సంతృప్తిని ఇవ్వలేరని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా లేదా అనే అంశాలను ప్రజలు చూస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు.
అనంతరం TGPSC ముట్టడిపై స్పందించిన ఆయన.. నిరుద్యోగుల సమస్యల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల సమస్యలను ఓపికగా వినే ప్రయత్నం కూడా చేయడం లేదని అన్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి నిరుద్యోగులు వస్తే.. పట్టించుకోకపోగా ఇనుప కంచెలు, ముళ్ల కంచెలు అడ్డుగా పెట్టి అరెస్టులు చేయించారని మండిపడ్డారు. చివరికి ఆ దారిలో వెళ్తున్న సామాన్య ప్రజలను, పని మీద వచ్చిన రైతులను కూడా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల పట్ల ప్రభుత్వ తీరు ఈ విధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇదే కొనసాగిస్తే అన్ని విషయాల్లో విఫలమవుతున్న ప్రభుత్వనికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కుతారని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.