ప్రతి రోజూ ఒక ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని జనసేన నాయకులకు సూచించారు. అధికారంలోకి వచ్చామని దుర్వినియోగం చేయొద్దని అన్నారు. రౌడీయిజాన్ని నమ్మొద్దు. దురుసుగా మాట్లాడ్డం.. బెదిరింపు ధోరణితో వెళ్లడం సరికాదని తెలిపారు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే.. వారిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన తరపున ఎన్నికైన శాసనసభ్యులు, లోక్ సభ సభ్యులు, శాసన మండలి సభ్యులను పవన్ సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోకి రావాలని.. మంత్రి పదవి ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారని ఆయన తెలిపారు.
కానీ, రాష్ట్రంలోనే ఉంటానని చెప్పి సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. అడగాల్సిన సమయం వస్తే రాష్ట్రం కోసం ప్రధానిని అడుగుతానని పవన్ హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, రైల్వే జోన్, 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వమని ప్రధానిని అడుగుతానని వెల్లడించారు.
అనంతరం మాట్లాడిన ఆయన.. ప్రతి రోజూ ఒక ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని జనసేన నాయకులకు సూచించారు. అధికారంలోకి వచ్చామని దుర్వినియోగం చేయొద్దని అన్నారు. రౌడీయిజాన్ని నమ్మొద్దు. దురుసుగా మాట్లాడ్డం.. బెదిరింపు ధోరణితో వెళ్లడం సరికాదని తెలిపారు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే.. వారిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు.
మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శించినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. సంస్కరించాల్సిన మనమే.. తప్పులు చేయకూడదని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు పవన్ కల్యాణ్ సూచనలు చేశారు.